శ్రీశైలం భక్తులకు శుభవార్త.. నవంబరు నెల టికెట్లు విడుదల
శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకోవాలనుకునే భక్తులకు దేవస్థానం కీలక సమాచారం అందించింది.
Temple


అమరావతి , 28 అక్టోబర్ (హి.స.)

శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించుకోవాలనుకునే భక్తులకు దేవస్థానం కీలక సమాచారం అందించింది. నవంబరు నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు, స్పర్శ దర్శనం టికెట్లను ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ విషయాన్ని దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పోతుగుంట రమేశ్ నాయుడు, ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు సంయుక్త ప్రకటనలో వెల్లడించారు.

భక్తులు టికెట్లు పొందే ప్రక్రియను మరింత సులభతరం చేయడంతో పాటు, ఆన్లైన్ సేవలను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా టికెట్ల కేటాయింపులో కొత్త విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా మొత్తం టికెట్లలో 80 శాతం వాటాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న ‘మనమిత్ర’ వాట్సాప్ సేవ ద్వారా కేటాయించారు. మిగిలిన 20 శాతం టికెట్లను శ్రీశైలం దేవస్థానం అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.

ఈ విధానం ద్వారా భక్తులు తమకు అనుకూలమైన మార్గంలో టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కలుగుతుంది. ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తగ్గించి, సేవలు, దర్శనాల నిర్వహణను మరింత క్రమబద్ధంగా చేపట్టేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని దేవస్థానం అధికారులు భావిస్తున్నారు. భక్తులు టికెట్లను బుక్ చేసుకునే సమయంలో అధికారిక మార్గాలను మాత్రమే వినియోగించాలని సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande