
హైదరాబాద్, 28 అక్టోబర్ (హి.స.)
ఉస్మానియా జనరల్ ఆసుపత్రి నిర్మాణ పనులను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
గోషామహల్లో నూతనంగా నిర్మితమవుతున్న ఉస్మానియా జనరల్ ఆసుపత్రి నిర్మాణ పనులను మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం పరిశీలించారు.
హాస్పిటల్ నిర్మాణంపై అధికారులకు పలు సూచనలు చేసిన మంత్రి పొన్నం.. నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని చెప్పారు. పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
పనుల్లో జాప్యం తగదని స్పష్టం చేశారు. హాస్పిటల్ మోడల్ డిజైన్లను మంత్రి పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. 2700 కోట్లతో 2 వేల పడకలతో చరిత్రలో నిలిచిపోయే విధంగా భవిష్యత్ తరాలకు అందించేలా ఉస్మానియా జనరల్ ఆసుపత్రి నిర్మాణం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు.
ఆస్పత్రి నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే పుట్టింగ్ పనులు పూర్తయి, రెండు అంతస్తుల స్లాబుల నిర్మాణం పూర్తయిందని అధికారులు వెల్లడించారు. స్థల సేకరణ, రోడ్డు కనెక్టివిటీ, పక్కనున్న హాస్టల్ హెరిటేజ్ సంబంధిత లీగల్ అంశాలు వంటి చిన్నపాటి సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు