
తిరుమల , 29 అక్టోబర్ (హి.స.)
తిరుమల శ్రీవారిని ఇస్రో ఛైర్మన్ నారాయణన్ దర్శించుకున్నారు. గురువారం తిరుమల శ్రీవారి ఆలయానికి చేరుకున్న ఆయన స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఇస్రో చేపట్టనున్న తదుపరి అంతరిక్ష ప్రయోగం గురించి వివరాలను వెల్లడించారు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో కీలక ప్రయోగానికి సిద్ధమవుతోందని నారాయణన్ తెలిపారు. ఎన్వీఎస్-03 నావిగేషన్ ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపేందుకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయని చెప్పారు. ఈ ప్రయోగాన్ని శుక్రవారం రాత్రి 11.51 గంటలకు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రయోగానికి సంబంధించిన సాంకేతిక ఏర్పాట్లను శాస్త్రవేత్తలు పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు.
భారతదేశానికి అవసరమైన నావిగేషన్ సేవలను మరింత బలోపేతం చేయడంలో ఈ ఉపగ్రహ ప్రయోగం కీలకంగా నిలవనుంది. దేశీయంగా అభివృద్ధి చేస్తున్న నావిగేషన్ వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు, వివిధ రంగాలకు మెరుగైన స్థాన నిర్ధారణ సేవలు అందించేందుకు ఇలాంటి ఉపగ్రహాలు ఉపయోగపడతాయి. ఎన్వీఎస్ సిరీస్లో మొత్తం ఐదు నావిగేషన్ ఉపగ్రహాలను ప్రయోగించాలనే ప్రణాళికలో భాగంగా ఎన్వీఎస్-03 మూడో ఉపగ్రహమని నారాయణన్ వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్