సాంస్కృతిక వారధులుగా విద్యార్థులు నిలవాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
దేశంలోని విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, కళలు, జీవన విధానాలను పరస్పరం అర్థం చేసుకోవడమే 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా స్పష్టం చేశారు.
Governor


హైదరాబాద్, 29 అక్టోబర్ (హి.స.)

దేశంలోని విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, కళలు, జీవన విధానాలను పరస్పరం అర్థం చేసుకోవడమే 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా స్పష్టం చేశారు. 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ - యువ సంగమం ఫేజ్-7' లో భాగంగా అస్సాం రాష్ట్రం నుంచి తెలంగాణకు వచ్చిన 72 మంది సభ్యుల విద్యార్థి బృందంతో గురువారం ఉదయం రాజ్ భవన్ దర్బార్ హాల్లో గవర్నర్ ముఖాముఖి నిర్వహించారు.

ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ విద్యా పర్యటనలను కేవలం షాపింగ్, వినోదానికే పరిమితం చేయకూడదని, ఆయా ప్రాంతాల చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలపై స్పష్టమైన అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, హైదరాబాద్ విశ్వవిద్యాలయం సంయుక్తంగా అక్టోబర్ 23 నుంచి 29 వరకు నిర్వహిస్తున్న ఈ యువ సంగమం కేవలం సాధారణ విహారయాత్ర కాదని, జ్ఞానాన్ని విస్తరించుకోవడానికి లభించిన అరుదైన అవకాశమని పేర్కొన్నారు. అస్సాం, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న సాంస్కృతిక అనుబంధాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఈశాన్య రాష్ట్రాల ప్రత్యేకతలను తెలంగాణకు, అలాగే తెలంగాణ విశిష్టతలను ఈశాన్య ప్రాంతాలకు పరిచయం చేసే సాంస్కృతిక వారధులుగా విద్యార్థులు శ్రమించాలని ఆకాంక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ అద్భుత కార్యక్రమం జాతీయ సమైక్యతను మరింత దిశగా తీసుకెళ్తుందన్నారు. పర్యటనలో భాగంగా చార్మినార్ చారిత్రక నేపథ్యం, గోల్కొండ కోట నిర్మాణంలో ఉన్న అద్భుత సాంకేతికత, తెలంగాణ భాషా సౌందర్యం, స్థానిక ఆహార అలవాట్లు, ఇక్కడి పండుగల ప్రత్యేకతలను క్షుణ్ణంగా తెలుసుకోవాలని విద్యార్థులకు గవర్నర్ సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande