అర్నబ్ తుపాను బాధితులకు ఊరట: భారీ నష్టపరిహారం ప్యాకేజీ ప్రకటించిన సీఎం చంద్రబాబు
అర్నబ్ తుపాను బాధితులకు ఊరట: భారీ నష్టపరిహారం ప్యాకేజీ ప్రకటించిన సీఎం చంద్రబాబు
చంద్రబాబు


అమరావతి:, 29 అక్టోబర్ (హి.స.)

అర్నబ్ తుపాను ధాటికి తీవ్రంగా నష్టపోయిన ప్రజలను, రైతులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అతిపెద్ద సహాయక ప్యాకేజీని ప్రకటించింది. తుపాను అనంతర పరిస్థితులు, సహాయక చర్యలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. నష్టపోయిన చివరి వ్యక్తి వరకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ అత్యంత పారదర్శకంగా పరిహారం అందిస్తామని భరోసా ఇచ్చారు.

తక్షణ సహాయం మరియు ఇళ్ల నష్టపరిహారం

తుపాను కారణంగా మరణించిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్-గ్రేషియా అందించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇళ్లలోకి నీరు చేరిన ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం పంపిణీ చేయనుండగా, మత్స్యకారులు మరియు చేనేత కార్మికులకు 50 కేజీల బియ్యం అందిస్తారు. వీటితో పాటు ఉచితంగా కేజీ కందిపప్పు, లీటర్ పామాయిల్, కేజీ ఉల్లిపాయలు, కేజీ చక్కెర, కేజీ బంగాళదుంపలను పంపిణీ చేయనున్నారు. తక్షణ ఖర్చుల కోసం ఒక్కో కుటుంబానికి రూ. 1,000 నుంచి గరిష్టంగా రూ. 3,000 వరకు ఆర్థిక సహాయం అందజేస్తారు. పాక్షికంగా ఇల్లు దెబ్బతిన్న వారికి రూ. 10,000 ఆర్థిక సాయం ప్రకటించారు.

వ్యాపారాలు, జీవనోపాధి మరియు మత్స్యకారులకు చేయూత

చిన్న కిరాణా షాపులు, రెస్టారెంట్లు, చేతివృత్తుల వారు, సర్వీస్ షాపుల నిర్వాహకులకు రూ. 25,000 చొప్పున సహాయం అందించనున్నారు. తోపుడు బండ్లు దెబ్బతింటే రూ. 20,000, దెబ్బతిన్న ద్విచక్ర వాహనానికి రూ. 3,000, ఆటోకు రూ. 10,000 చొప్పున పరిహారం ఇస్తారు. ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు వారి టర్నోవర్ ఆధారంగా రూ. 50,000 నుంచి గరిష్టంగా రూ. 1,50,000 వరకు చేయూతనిస్తారు. ఇక మత్స్యకారుల వలలు పాక్షికంగా దెబ్బతింటే రూ. 5,000, కొత్తవి కొనుగోలుకు రూ. 10,000 అందజేస్తారు. మెకనైజ్డ్ కాని బోటు దెబ్బతింటే రూ. 20,000, మెకనైజ్డ్ బోటు దెబ్బతింటే రూ. 25,000 అందించడంతో పాటు చేపల చెరువుల పునరుద్ధరణకు రూ. 18,000 కేటాయించారు.

పశు నష్టం మరియు పంట పరిహారం వివరాలు

పశుసంపద కోల్పోయిన రైతులకు ఆవు లేదా గేదె మరణిస్తే రూ. 50,000, దూడలకు రూ. 25,000, గొర్రె లేదా మేకకు రూ. 7,500, కోడికి రూ. 100 చొప్పున (గరిష్టంగా రూ. 10,000) పరిహారం చెల్లిస్తారు. దెబ్బతిన్న పశువుల షెడ్లకు రూ. 5,000 ఇస్తారు. వ్యవసాయ, ఉద్యాన పంటల నష్టానికి సంబంధించి హెక్టారుకు తమలపాకు పంటకు అత్యధికంగా రూ. 75,000 ప్రకటిచారు. అరటి, పసుపు, మిరప, మామిడి వంటి తోటల పంటలకు హెక్టారుకు రూ. 35,000 అందిస్తారు. వరి, పత్తి, వేరుశనగ, కూరగాయలకు హెక్టారుకు రూ. 25,000 పరిహారం ఇస్తారు. మినుములు, పెసలు, మొక్కజొన్న వంటి పంటలకు హెక్టారుకు రూ. 15,000 చొప్పున చెల్లిస్తారు. ఈదురు గాలులకు కూలిపోయిన ఆయిల్ పామ్, కొబ్బరి చెట్లకు ఒక్కో చెట్టుకు రూ. 1,500 చొప్పున నష్టపరిహారం చెల్లించనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande