
హైదరాబాద్ , 05 అక్టోబర్ (హి.స.)తెలంగాణలో బార్ అండ్ రెస్టారెంట్ వ్యాపారుల నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన స్వరం వినిపించింది. ప్రతిపాదిత ప్రివిలేజ్ సెస్సును వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,200 బార్లు, రెస్టారెంట్లు మూసివేతకు పిలుపునిచ్చారు. బార్ యజమానుల సంఘం ఈ అదనపు భారాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టాలని నిర్ణయించింది.
బార్ వ్యాపారుల వాదన ప్రకారం ఇప్పటికే లైసెన్స్ ఫీజులు భారీగా ఉన్నాయని, వాటిపై మరో అదనపు సెస్సు విధిస్తే వ్యాపార నిర్వహణ మరింత భారంగా మారుతుందని చెబుతున్నారు. కొత్త ప్రతిపాదన వల్ల ఖర్చులు సుమారు 8 నుంచి 20 శాతం వరకు పెరగవచ్చని, కొన్ని సంస్థలపై ఏడాదికి రూ.30 లక్షల వరకు అదనపు భారం పడే అవకాశం ఉందని సంఘం పేర్కొంది.
ఇప్పటికే మద్యం దుకాణాలకు అనుమతించే కొన్ని అదనపు సదుపాయాలు, పర్మిట్ రూములు, బెల్ట్ షాపుల కారణంగా బార్ వ్యాపారంపై పోటీ పెరిగిందని యజమానులు అంటున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్