
నిజామాబాద్, 05 అక్టోబర్ (హి.స.)
పోలీస్ స్టేషన్ ఆవరణలోనే ఓ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్న ఘటన నిజామాబాద్ జిల్లా భీమ్గల్లో చోటు చేసుకుంది.
భీమ్గల్కు చెందిన సుధాకర్ అనే వ్యక్తి స్థానికంగా హోటల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రాత్రి 10 గంటల తర్వాత కూడా హోటల్ బయట టేబుళ్లు వేసి వ్యాపారం చేస్తున్నారనే నెపంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఈరోజు (సోమవారం) ఉదయం సుధాకర్ను పోలీస్ స్టేషన్కు పిలిపించిన పోలీసులు.. కోర్టుకు వెళ్లాలని చెప్పారు.
ఇప్పటికే పలుమార్లు తనను లక్ష్యంగా చేసుకుని జరిమానాలు వేస్తూ వేధింపులకు గురిచేస్తున్నారంటూ సుధాకర్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే స్టేషన్ ఆవరణలోనే తన వెంట తెచ్చుకున్న పెట్రోల్ ఒంటిపై పోసుకుని నిప్పు అంటించుకున్నాడు.
క్షణాల్లో మంటలు వ్యాపించడంతో.. పోలీసులు వెంటనే మంటలను ఆర్పి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు