
హైదరాబాద్ , 05 అక్టోబర్ (హి.స.)హైదరాబాద్లో గత పది రోజుల వ్యవధిలో హోటల్ గదుల్లో ముగ్గురు యువతులు హత్యకు గురైన ఘటనలు పోలీసులను అప్రమత్తం చేశాయి. ఈ ఘటనల నేపథ్యంలో తక్కువ ధరలకు గదులు అద్దెకు ఇచ్చే చిన్న హోటళ్లు, లాడ్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పోలీసు విభాగం సూచించారు. ముఖ్యంగా జంటలు గది తీసుకున్నప్పుడు వారిలో ఒకరు మాత్రమే బయటకు వెళ్లడం, నకిలీ గుర్తింపు పత్రాలతో గదులు బుక్ చేయడం వంటి అనుమానాస్పద పరిణామాలను హోటల్ నిర్వాహకులు గమనించాలని పోలీసులు సూచిస్తున్నారు. హోటల్ గదుల్లో జరిగే నేరాలను దర్యాప్తు చేయడంలో ప్రధాన సమస్యల్లో ఒకటి నిందితుల గుర్తింపును నిర్ధారించడం. సరైన ఐడీ ధ్రువీకరణ లేకుండా గదులు ఇవ్వడం లేదా నకిలీ పత్రాలతో చెక్-ఇన్ చేసే అవకాశం ఉంటే పోలీసులకు దర్యాప్తులో ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే హోటళ్లు తమ అతిథుల వివరాలను సక్రమంగా నమోదు చేయడం, గుర్తింపు పత్రాలను ధృవీకరించడం చాలా అవసరం. హైదరాబాద్లో ఐటీ రంగం, వ్యాపారం, విద్య, వైద్యం వంటి కారణాలతో ప్రతిరోజూ వేలాది మంది ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వస్తుంటారు. దీంతో హోటళ్లు, లాడ్జీలకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఈ పరిస్థితిని నేరాలకు ఉపయోగించుకునే అవకాశాన్ని పూర్తిగా నిరోధించడానికి హోటల్ యాజమాన్యాలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుందని పోలీసులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్