ఘోర రోడ్డు ప్రమాదం.. మంత్రి గొట్టిపాటి డ్రైవర్ శ్రీహరి మృతి
రోడ్డు ప్రమాదంలో మంత్రి గొట్టిపాటి డ్రైవర్ దుర్మరణం
Accident


చిలకలూరిపేట, 06 అక్టోబర్ (హి.స.) ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వద్ద వ్యక్తిగత డ్రైవర్గా పనిచేస్తున్న తన్నీరు శ్రీహరి (33) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

చిలకలూరిపేట పరిధిలోని పోలిరెడ్డి పాలెం బైపాస్ రోడ్డుపై ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. శ్రీహరి తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, ఎదురుగా వస్తున్న కారును బలంగా ఢీకొట్టడంతో తీవ్ర ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాద తీవ్రతకు బైక్ నుంచి ఎగిరి రోడ్డుపై పడడంతో ఆయన తల, శరీర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు, వాహనదారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి పోలీసులకు సమాచారం అందించారు.

తీవ్ర రక్తస్రావం కావడంతో శ్రీహరిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ, పరిస్థితి విషమించడంతో మార్గమధ్యంలోనే ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ సమాచారం అందుకున్న చిలకలూరిపేట గ్రామీణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తన వద్ద నమ్మకంగా పనిచేసే డ్రైవర్ శ్రీహరి రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడం పై మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా ఈ ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande