వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఖరిపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి ఆగ్రహం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, వారి వైఖరిపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
మంత్రి మండిపల్లి


అమరావతి, 06 అక్టోబర్ (హి.స.)వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, వారి వైఖరిపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఈరోజు(మంగళవారం) మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ స్థాపించినప్పటి నుంచీ ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేశ్.. బీసీల హక్కుల కోసం పోరాడుతున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీకి బీసీలే వెన్నెముక అని పేర్కొన్నారు. టీడీపీకి వెన్నెముకగా ఉండే బీసీలను ఆదరించటం పార్టీ కర్తవ్యమని వ్యాఖ్యానించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించాలనే మాటకు పార్టీ కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారన్నారు.

రాజ్యాంగ బద్ధంగా బీసీలకు 34% రిజర్వేషన్ హక్కు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం పోరాడుతోందని మంత్రి తెలిపారు. అటువైపు ఏబీసీడీలు రాని అవగాహన లేని జగన్మోహన్ రెడ్డి ఉంటే.. ఈ పక్కన విజన్ కలిగిన ఎకనమిస్ట్ చంద్రబాబు నాయుడు ఉన్నారన్నారు. భవిష్యత్తులో కోర్టు తీర్పులు ఎలా ఉన్నా.. తమ పార్టీ అజెండా 34శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉంటుందని తేల్చిచెప్పారు. గత ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన జగన్ పార్టీ బీసీల రిజర్వేషన్లపై మొసలి కన్నీరు కారుస్తోందని మండిపడ్డారు. కోర్టుల్లో పిటిషన్లు వేసి ఎన్నికలను ఆపాలని చూస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే నిలిచిపోయిన 15వ ఆర్థిక సంఘం నిధులు రాష్ట్రానికి విడుదలయ్యాయని మండిపల్లి పేర్కొన్నారు. పల్లె పండుగ-3.0 కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని, పేదల ఇళ్ల నిర్మాణంతో పాటు సుమారు లక్ష కోట్లతో హార్టికల్చర్ రంగాన్ని పురోగతి పథంలోకి తీసుకెళ్తున్నామని వివరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande