
అమరావతి , 08 అక్టోబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్లో ఈరోజు వాతావరణ పరిస్థితులపై భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రం కీలక హెచ్చరికలు జారీ చేసింది. అక్టోబర్ 8, 9 తేదీల్లో కోస్తాంధ్రతో పాటు రాయలసీమలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వాతావరణం ఉండే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ముఖ్యంగా పిడుగులు పడే సమయంలో ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తోంది.
కోస్తాంధ్ర ప్రాంతానికి అక్టోబర్ 8, 9 తేదీల్లో ఉరుములు, మెరుపులు, బలమైన ఉపరితల గాలులకు హెచ్చరిక జారీ అయింది. ఇదే తరహా హెచ్చరిక రాయలసీమకు కూడా వర్తిస్తుంది. అయితే అక్టోబర్ 10 నుంచి 14 వరకు రాష్ట్రానికి సంబంధించి ఈ ప్రత్యేక హెచ్చరికలు లేవని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.
ఇటీవల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు, ఈదురుగాలుల కారణంగా విద్యుత్ తీగలు తెగిపోవడం, చెట్లు పడిపోవడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. గత వర్షాల సమయంలో విద్యుత్ తీగలను తాకి పలువురు మృతి చెందిన ఘటనలు కూడా నమోదయ్యాయి. అందువల్ల ప్రస్తుత హెచ్చరికల నేపథ్యంలో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, చెట్ల కింద నిలబడకపోవడం, వ్యవసాయ పనుల్లో పిడుగుల సమయంలో జాగ్రత్తగా ఉండటం అత్యవసరం.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్