
అమరావతి , 08 అక్టోబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా సంక్షేమ పథకం ‘తల్లికి వందనం’ పరిధిని మరింత విస్తరించింది. 2026–27 విద్యా సంవత్సరానికి అదనంగా 58,601 మంది అర్హులైన విద్యార్థులను పథకంలో చేర్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో మొత్తం లబ్ధిదారుల సంఖ్య 67,47,190 నుంచి 68,05,791కు పెరిగింది. ఈ పథకం ద్వారా అర్హులైన తల్లులకు వారి పిల్లల విద్య కోసం ఆర్థిక సహాయం అందుతోంది.
రెండో దశలో ఎంపికైన 3,29,201 మంది లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించేందుకు కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగా పథకానికి పరిపాలనా అనుమతి మొత్తాన్ని రూ.10,120.78 కోట్ల నుంచి రూ.10,208.69 కోట్లకు పెంచింది. విద్యార్థులు పాఠశాల విద్యను కొనసాగించేందుకు కుటుంబాలకు ఆర్థికంగా కొంత భరోసా కల్పించడమే ఈ పథకం లక్ష్యంగా ప్రభుత్వం చెబుతోంది.
అదే సమయంలో సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు, ఇతర ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థుల డైట్ ఛార్జీలను కూడా ప్రభుత్వం పెంచింది. అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చేలా 10 శాతం పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనివల్ల వివిధ సంక్షేమ శాఖలు, పాఠశాల విద్యా శాఖ పరిధిలోని సుమారు 6.28 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది.
విద్యా రంగంలో పెట్టుబడులు, అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించే విధానాలతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల పరిధిని విస్తరించడం ద్వారా పాఠశాల విద్యలో నమోదు, హాజరు, కొనసాగింపును మెరుగుపరచాలని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల్లో పిల్లల విద్యకు సంబంధించిన ఖర్చులను తగ్గించడం ఈ తరహా పథకాల ప్రధాన ఉద్దేశంగా నిలుస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్