ప్రభుత్వ ఉద్యోగుల సస్పెన్షన్పై సుప్రీంకోర్టు కీలక తీర్పు: 48 గంటల కస్టడీ ఉంటే చట్టబద్ధమైన సస్పెన్షన్
ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన తీర్పును వెలువరించింది.
Court


ఢిల్లీ , 10 నవంబర్ (హి.స.)ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన తీర్పును వెలువరించింది. ఏదైనా క్రిమినల్ లేదా అవినీతి కేసులో అరెస్ట్ అయిన ప్రభుత్వ ఉద్యోగి 48 గంటలకు మించి జ్యుడీషియల్ కస్టడీలో (జైలులో) ఉంటే, ఆ వ్యక్తి చట్ట ప్రకారం స్వయంసిద్ధంగా (డీమ్డ్) సస్పెండ్ అయినట్టే పరిగణించాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఆయా శాఖల ఉన్నతాధికారులు లేదా ప్రభుత్వం ప్రత్యేకంగా వేరే సస్పెన్షన్ ఆర్డర్ జారీ చేయాల్సిన అవసరం లేదని కోర్టు తేల్చిచెప్పింది.

అవినీతి నిరోధక చట్టం, ఇతర తీవ్రమైన కేసుల్లో నిందితులుగా ఉన్న ఉద్యోగులపై శాఖాపరమైన చర్యల నమోదులో జరుగుతున్న ఆలస్యాన్ని అరికట్టడమే లక్ష్యంగా ఈ తీర్పు వెలువడింది. 48 గంటల వ్యవధి ముగిసిన వెంటనే ఆ ఉద్యోగి హోదా నిలిచిపోతుందని, ఆ సమయం నుంచి వారు ఎలాంటి అధికారిక బాధ్యతల్లో కొనసాగడానికి వీల్లేదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

ఉద్యోగులు బెయిల్పై విడుదలైనప్పటికీ, సస్పెన్షన్ పునరుద్ధరణ లేదా రద్దుపై సంబంధిత ప్రభుత్వ అధికార యంత్రాంగం అధికారిక నిర్ణయం తీసుకునే వరకు ఆ సస్పెన్షన్ అమల్లోనే ఉంటుందని స్పష్టం చేసింది. పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచడానికి మరియు లంచగొండితనం, తీవ్ర నేరాలకు పాల్పడే అధికారులు వ్యవస్థలోని ఖాళీలను వాడుకోకుండా నిరోధించడానికి ఈ తీర్పు దోహదపడుతుందని నిపుణులు భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలన్నింటికీ ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande