
అమరావతి , 11 నవంబర్ (హి.స.)
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 13వ తేదీ నాటికి అల్పపీడనం ఏర్పడవచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇది క్రమంగా వాయవ్య దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
వాతావరణ పరిస్థితుల ప్రకారం ఈ నెల 14వ తేదీ నాటికి అల్పపీడనం సుస్పష్ట అల్పపీడనంగా మారవచ్చని, 15వ తేదీ నాటికి అదే ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశముందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ వ్యవస్థ తదుపరి ఏ దిశగా పయనిస్తుంది? ఎంత తీవ్రతతో కొనసాగుతుంది? అనే అంశాలపై రానున్న రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
సముద్రంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవచ్చనే హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. ఈ నెల 13 నుంచి బంగాళాఖాతంలో చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. ఇప్పటికే సముద్రంలో ఉన్న మత్స్యకారులు కూడా వాతావరణ పరిస్థితులను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్