
వరంగల్, 11 నవంబర్ (హి.స.)
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని కాజీపేట ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో రూ.10 కోట్ల వ్యయంతో నిర్మించనున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ భవనానికి బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్య అందించి, ప్రపంచ స్థాయిలో పోటీపడేలా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. విద్య ద్వారానే సమాజంలో సమగ్ర అభివృద్ధి సాధ్యమని చెప్పారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో నాణ్యమైన విద్య అందిస్తామని చెప్పారు. ఆధునిక తరగతి గదులు, డిజిటల్ విద్యాబోధన, శిక్షణ పొందిన ఉపాధ్యాయులు, రవాణా సదుపాయాలు కల్పిస్తామన్నారు. విద్యార్థులకు యూనిఫామ్లు, షూస్, పుస్తకాలు, బ్యాగులు ఉచితంగా అందిస్తామని వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు