
అమరావతి , 12 నవంబర్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు వేగవంతం చేసింది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా తొలి విడతకు సంబంధించిన నోటిఫికేషన్‌ను రేపు విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్‌కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు, నోటిఫికేషన్ విడుదలతో తదుపరి ప్రక్రియను ప్రారంభించనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. షెడ్యూల్ ప్రకారం నవంబర్ 26న తొలి విడత పోలింగ్ జరగనుంది. అనంతరం నవంబర్ 29న రెండో విడత ఎన్నికలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 2న మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. అదే రోజు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు.
గ్రామస్థాయిలో ఎన్నికల సందడి మొదలుకానుండటంతో రాజకీయ పార్టీలు, ఆశావహులు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలను దక్కించుకునేందుకు అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఎన్నికలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్