
అమరావతి , 12 నవంబర్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్లో మరోసారి ఎన్నికల సందడి నెలకొననుంది. రాష్ట్రంలోని 23 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) సిద్ధమైంది. ఇందులో నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు 19 పురపాలక సంఘాలు ఉన్నాయి. శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం, మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు మరో 19 మున్సిపాలిటీల్లోనూ ఎన్నికల ప్రక్రియ చేపట్టనున్నారు.
ఎన్నికలకు సంబంధించిన పూర్తి వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నేడు మధ్యాహ్నం 12.30 గంటలకు వెల్లడించనున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల షెడ్యూల్, నామినేషన్ల స్వీకరణ, ప్రచారం, పోలింగ్ తదితర అంశాలపై స్పష్టత రానుంది. మరోవైపు రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు కూడా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. రేపు తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నెల 26న మొదటి విడత, 29న రెండో విడత పోలింగ్ నిర్వహించనున్నారు. డిసెంబర్ 2న మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజున పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వరుసగా ఎన్నికలు జరగనుండటంతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎన్నికల సన్నాహాల్లో నిమగ్నమవుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్