
అమరావతి , 12 నవంబర్ (హి.స.) రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులకు మరింత భద్రత కల్పించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. గురువారం విశాఖపట్నంలో ప్రారంభమైన 31వ సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2026 ప్రారంభ సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు.
పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడేందుకు 'ఇన్వెస్టర్స్ ప్రొటెక్షన్ యాక్ట్' పేరుతో ప్రత్యేక చట్టాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే పెట్టుబడిదారులకు భరోసా కల్పించేలా ఎస్క్రో ఖాతాల విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని వివరించారు. ఈ చర్యలకు కొనసాగింపుగా పెట్టుబడుల రక్షణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని నిర్ణయించినట్లు చెప్పారు.
దేశంలోనే పెట్టుబడిదారుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను నిలపాలన్నది ప్రభుత్వ లక్ష్యమని లోకేశ్ పేర్కొన్నారు. ఈ ప్రతిపాదిత చట్టానికి అవసరమైన విధానపరమైన అనుమతులు కల్పించడంతో పాటు, జాతీయ స్థాయిలో ఈ విధానం అమలుకు సహకరించాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్‌ను కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్