
విశాఖపట్నం , 12 నవంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా విశాఖపట్నంలో నేటి నుంచి రెండు రోజుల పాటు 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు జరగనుంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో ఈ సదస్సును నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. వివిధ దేశాల నుంచి పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, ప్రభుత్వ ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
ఈ సదస్సులో 59 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొననుండగా, సుమారు 15 మంది మంత్రులు, 1,250 మంది పారిశ్రామికవేత్తలు హాజరుకానున్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపన, పెట్టుబడుల అవకాశాలు, ఉపాధి కల్పన, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రధానంగా చర్చించనున్నారు. వివిధ రంగాలకు చెందిన సంస్థలతో పెట్టుబడి ఒప్పందాలు కుదుర్చుకోవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
సదస్సు ముగింపు కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి హాజరుకానున్నారు. ప్రముఖులు, విదేశీ ప్రతినిధుల రాక నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మొత్తం 2,700 మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా 12 ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ స్థాయి పారిశ్రామిక సదస్సుకు విశాఖ ఆతిథ్యం ఇస్తుండటంతో నగరంలో సందడి నెలకొంది. ఈ సమావేశాల ద్వారా రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్