విశాఖ సీఐఐ గ్లోబల్ సమ్మిట్లో ఏపీ పెట్టుబడుల ప్రదర్శన.. పియూష్ గోయల్కు రాష్ట్ర అభివృద్ధి వివరించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్
విశాఖపట్నంలో జరుగుతున్న 31వ సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పెట్టుబడుల అవకాశాలను ప్రముఖంగా ప్రదర్శించింది.
Global


విశాఖపట్నం , 12 నవంబర్ (హి.స.)

విశాఖపట్నంలో జరుగుతున్న 31వ సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పెట్టుబడుల అవకాశాలను ప్రముఖంగా ప్రదర్శించింది. గురువారం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాష్ట్ర పెవిలియన్ను సందర్శించారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్ వారితో కలిసి ఏపీ పెవిలియన్తో పాటు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) పెవిలియన్ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల వ్యవసాయ సామర్థ్యం, అక్కడ పండించే పంటలు, పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను మంత్రి నారా లోకేశ్.. పియూష్ గోయల్కు వివరించారు. మరోవైపు రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ రంగాల్లో సాధిస్తున్న పురోగతిని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రికి వివరించారు.

ఏపీ పెవిలియన్లో రాష్ట్రంలోని పారిశ్రామిక పార్కులు, ఉత్పత్తులు, పెట్టుబడుల అవకాశాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రదర్శించారు. స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్, సౌర విద్యుత్ ప్రాజెక్టులు, దేశ అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సూచనలను డిజిటల్ ప్రదర్శనల ద్వారా సందర్శకులకు అందుబాటులో ఉంచారు.

నవంబర్ 12, 13 తేదీల్లో రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు దేశ విదేశాల నుంచి ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల ప్రముఖులు హాజరవుతున్నారు. వాణిజ్యం, సాంకేతికత, పెట్టుబడులు, అంతర్జాతీయ భాగస్వామ్యాలపై ఈ సదస్సులో చర్చలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈ సంస్థలు తమ ఉత్పత్తులు, వ్యాపార అవకాశాలను ప్రదర్శిస్తున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande