
తిరుపతి , 12 నవంబర్ (హి.స.)
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలోని ప్రసాదాల తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నెయ్యి ఒలికిపడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి కలకలం రేపాయి. ఈ ఘటనతో అప్రమత్తమైన పోటు సిబ్బంది వెంటనే తయారీ కేంద్రం నుంచి బయటకు పరుగులు తీశారు. దీంతో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా ప్రమాదం తప్పింది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే మంటల తీవ్రత కారణంగా అక్కడి విద్యుత్ తీగలు కాలిపోయినట్లు అధికారులు గుర్తించారు. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది స్పందించడంతో మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా అడ్డుకోగలిగారు.
ఈ ఘటనపై ఆలయ ఈవో బి.కె. వెంకటేశ్లు స్పందించారు. ప్రమాదం జరిగిన వెంటనే సిబ్బంది అప్రమత్తమై తగిన చర్యలు తీసుకున్నారని తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది వేగంగా స్పందించి మంటలను పూర్తిగా అదుపు చేశారని వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని స్పష్టం చేశారు. ఘటనతో కొద్దిసేపు ఆలయ పరిసరాల్లో ఆందోళన నెలకొన్నప్పటికీ, పరిస్థితి త్వరగా సాధారణ స్థితికి చేరుకుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్