
అమరావతి , 12 నవంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్‌కు భారీగా పెట్టుబడులు రానున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. రాష్ట్రంలో మరో 303 అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) కుదుర్చుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని, వీటి ద్వారా రూ.9.89 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. దీంతో గత రెండున్నరేళ్లలో రాష్ట్రానికి వచ్చిన మొత్తం పెట్టుబడి హామీలు రూ.32.49 లక్షల కోట్లకు చేరనున్నాయని పేర్కొన్నారు.
గురువారం విశాఖపట్నంలో ప్రారంభమైన 31వ సీఐఐ అంతర్జాతీయ పార్ట్నర్షిప్ సమ్మిట్-2026 ప్రారంభోత్సవంలో చంద్రబాబు ప్రసంగించారు. 2024 జూన్ నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో రూ.22.6 లక్షల కోట్ల పెట్టుబడులతో 714 ఎంవోయూలు కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. వీటిలో 526 ప్రాజెక్టులు, అంటే రూ.17.1 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన పనులు అమలు దశకు చేరుకున్నాయని వివరించారు. ఈ విధంగా 74 శాతం ఒప్పందాలు కార్యరూపం దాల్చే దిశగా ముందుకు సాగుతున్నాయని తెలిపారు.
ఇప్పటికే రూ.7.3 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు జరిగాయని, వాటికి సంబంధించిన పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. మరో 303 ప్రాజెక్టుల అమలుకు ప్రభుత్వం నిర్దిష్ట గడువులను కూడా నిర్ణయించిందని వెల్లడించారు.
పెట్టుబడి ఒప్పందాలను కార్యరూపంలోకి తీసుకురావడంలో 74 శాతం పురోగతి సాధించడం గొప్ప విజయమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఇలాంటి పనితీరును చాలా రాష్ట్రాలు, దేశాలు కూడా సాధించలేవని పేర్కొన్నారు.
రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సుకు హాజరైన పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టాలని ఆయన ఆహ్వానించారు. విశాఖ నుంచి తిరిగి వెళ్లేలోపు ప్రతి ఒక్కరూ రాష్ట్ర ప్రభుత్వంతో కనీసం ఒక ఎంవోయూ కుదుర్చుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.
వివిధ రంగాల్లో ఉన్న పెట్టుబడి అవకాశాలు, పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను సదస్సులో వివరించినట్లు తెలిపారు. పెట్టుబడిదారులతో కలిసి పనిచేస్తూ ఒప్పందాలను త్వరితగతిన అమలు చేసి, రాష్ట్రవ్యాప్తంగా ఉపాధి, అభివృద్ధి అవకాశాలను పెంచుతామని చంద్రబాబు స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్