
అమరావతి , 12 నవంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులకు మరో ప్రముఖ సంస్థ ముందుకొచ్చింది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్‌తో జరిగిన సమావేశం అనంతరం రెన్యూ సంస్థ ఏపీలో భారీ ప్రాజెక్టుల ఏర్పాటుకు అంగీకారం తెలిపింది. రాష్ట్రంలో మొత్తం రూ.29,500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పెట్టుబడులతో పారిశ్రామిక రంగానికి, ఇంధన ఉత్పత్తి రంగానికి మరింత ఊతం లభించనుంది.
ఒప్పందంలో భాగంగా 2 గిగావాట్ల సామర్థ్యంతో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం రూ.12,500 కోట్లు ఖర్చు చేయాలని సంస్థ నిర్ణయించింది. అలాగే గ్రీన్ అమ్మోనియా, ఈ-ఫ్యూయల్ ప్రాజెక్టుల స్థాపనకు రూ.17 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. మరోవైపు రూ.11 వేల కోట్లతో సిలికాన్ ప్రాజెక్టును కూడా ఏర్పాటు చేసేందుకు రెన్యూ సంస్థ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. ప్రాజెక్టులకు అవసరమైన అనుమతులు, ఇతర సదుపాయాల కల్పనలో పూర్తి మద్దతు అందిస్తామని తెలిపారు. పెట్టుబడుల అమలును వేగవంతం చేసి పనులు త్వరగా ప్రారంభించాలని సంస్థ ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టులు కార్యరూపం దాలిస్తే ఏపీలో పారిశ్రామిక అభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్