
హైదరాబాద్ , 12 నవంబర్ (హి.స.)ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల్లో మరోసారి ఉత్కంఠ నెలకొంది. ఈ వ్యవహారానికి సంబంధించి దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన ధర్మాసనం స్టే విధించేందుకు నిరాకరించింది. దీంతో తదుపరి పరిణామాలపై అభ్యర్థుల్లో ఆసక్తి నెలకొంది. ఈ కేసులో తదుపరి విచారణను డిసెంబర్ 12వ తేదీకి వాయిదా వేస్తూ న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది.
ఈ పరిణామంతో మొత్తం 68,420 మంది ఉపాధ్యాయ అభ్యర్థుల ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా పరీక్షకు సంబంధించిన తుది కీ విడుదల, ఫలితాల ప్రకటన ఎప్పుడు ఉంటాయనే అంశాలపై స్పష్టత లేకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. న్యాయపరమైన ప్రక్రియ కొనసాగుతుండటంతో నియామకాలకు సంబంధించిన తదుపరి చర్యలపై సందిగ్ధత నెలకొంది.
తుది కీ విడుదలైతే తమ సమాధానాలను మరోసారి పరిశీలించుకునే అవకాశం ఉంటుందని అభ్యర్థులు భావిస్తున్నారు. ఆ తర్వాత ఫలితాలు ప్రకటిస్తే నియామక ప్రక్రియలో ముందడుగు పడుతుందని ఆశిస్తున్నారు. అయితే కోర్టులో కేసు విచారణ ఇంకా పూర్తికాకపోవడంతో స్పష్టత రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. డిసెంబర్ 12న జరిగే తదుపరి విచారణపై ఇప్పుడు వేలాది మంది అభ్యర్థులు ఆశలు పెట్టుకున్నారు. అప్పటివరకు తుది కీ, ఫలితాల కోసం వారి నిరీక్షణ తప్పేలా లేదు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్