తెలంగాణలో ఇంటర్ బోర్డు రద్దుకు ప్రభుత్వం యోచన
తెలంగాణ విద్యావ్యవస్థలో కీలక మార్పులు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఇంటర్మీడియెట్ విద్యా విధానంలో మార్పులు చేసి, దాని స్థానంలో సీనియర్ సెకండరీ విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది.
Telangana CM Revanth Reddy


హైదరాబాద్ , 12 నవంబర్ (హి.స.)తెలంగాణ విద్యావ్యవస్థలో కీలక మార్పులు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఇంటర్మీడియెట్ విద్యా విధానంలో మార్పులు చేసి, దాని స్థానంలో సీనియర్ సెకండరీ విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విద్యాశాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. ప్రతిపాదిత మార్పుల ప్రకారం ఇంటర్మీడియెట్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేయనున్నారు. దీంతో తొమ్మిదో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు ఒకే విద్యా వ్యవస్థ పరిధిలో కొనసాగించే అవకాశం ఉంది. ప్రస్తుతం పదో తరగతి పూర్తయిన తర్వాత విద్యార్థులు ఇంటర్మీడియెట్ కళాశాలల్లో చేరాల్సి వస్తోంది. కొత్త విధానం అమల్లోకి వస్తే ఈ విభజన తొలగిపోనుంది. విద్యార్థులు మధ్యలో చదువు మానేయకుండా చూడటంతో పాటు డ్రాపౌట్ల సంఖ్యను తగ్గించడం ఈ మార్పుల ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు పాలిటెక్నిక్ విద్యను కూడా కార్మిక శాఖ పరిధిలోని ‘శక్తి’ విభాగం కిందకు తీసుకురావాలనే ప్రతిపాదనపై సమీక్షలో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ మార్పులకు సంబంధించి ప్రభుత్వం మరింత అధ్యయనం చేసి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande