చంద్రబాబు నాయకత్వంలోనే ‘ఆంధ్రప్రెన్యూర్స్’ ఆవిర్భావం: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
ఆంధ్రప్రదేశ్లో ‘ఆంధ్రప్రెన్యూర్స్’ అనే కొత్త పారిశ్రామిక సంస్కృతికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కారణమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు.
Chandrababu Naidu


అమరావతి , 12 నవంబర్ (హి.స.)

ఆంధ్రప్రదేశ్లో ‘ఆంధ్రప్రెన్యూర్స్’ అనే కొత్త పారిశ్రామిక సంస్కృతికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కారణమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆయన నాయకత్వం, అమలు చేస్తున్న విధానాలు రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ, అన్ని ప్రాంతాల్లో కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయని ప్రశంసించారు.

గురువారం విశాఖపట్నంలో ప్రారంభమైన 31వ సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రామ్మోహన్ నాయుడు పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు నాయుడికి ఐటీ మ్యాన్, సీఈఓ మ్యాన్, వాటర్ మ్యాన్ వంటి ఎన్నో పేర్లు ఉన్నాయని గుర్తుచేశారు. వివిధ రంగాల్లో ఆయన చేసిన కృషి, సాధించిన విజయాలే ఈ గుర్తింపులకు కారణమని పేర్కొన్నారు.

ప్రజలు ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా సొంతంగా వ్యాపారాలు, పరిశ్రమలు స్థాపించేలా ప్రోత్సహించడమే ‘ఆంధ్రప్రెన్యూర్స్’ భావన వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని వివరించారు. సరైన నాయకత్వం, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రూపొందించే విధానాలు, స్పష్టమైన లక్ష్యాలు ఉంటే ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పులు తీసుకురావచ్చని అన్నారు.

ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నాయకత్వాన్ని కూడా ఆయన ప్రశంసించారు. పెట్టుబడుల ప్రతిపాదనలను నిరంతరం పర్యవేక్షిస్తూ, పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన సహకారం అందించి, ప్రాజెక్టులు కార్యరూపం దాల్చేలా కృషి చేస్తున్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్ను ప్రత్యేకంగా అభినందించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande