
న్యూఢిల్లీ,,15 నవంబర్ (హి.స.)
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (నైలెట్) ఆధ్వర్యంలో నవంబర్ 16, 17 తేదీల్లో ఇక్కడ సైబర్ భద్రత, డిజిటల్ ఫోరెన్సిక్స్‌పై మూడో జాతీయ సదస్సు జరగనుంది. డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో నిర్వహించనున్న ఈ సదస్సుకు ‘సైబర్ సురక్షిత భారత్: భారతదేశ డిజిటల్ భవిష్యత్తును బలోపేతం చేయడం’ అనే ఇతివృత్తాన్ని నిర్ణయించారు.
కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ కింద నిర్వహించే ఈ సదస్సులో ప్రభుత్వం, న్యాయ అమలు సంస్థలు, రక్షణ రంగం, న్యాయవ్యవస్థ, టెక్నాలజీ కంపెనీలు, పరిశ్రమలు, విద్యాసంస్థల ప్రతినిధులు పాల్గొంటారు. సైబర్ ముప్పులు, డిజిటల్ దర్యాప్తులో ఎదురయ్యే సవాళ్లపై చర్చించడంతో పాటు వివిధ సంస్థల మధ్య సమన్వయం, సామర్థ్య పెంపొందించడం ఈ సదస్సు ప్రధాన ఉద్దేశం.
కృత్రిమ మేధస్సు (ఏఐ), బ్లాక్‌చైన్ భద్రత, సైబర్ గూఢచర్యం వంటి ఆధునిక సాంకేతికతల వినియోగంపై సదస్సులో చర్చిస్తామని నైలెట్ తెలిపింది. ఇందుకోసం సైబర్ భద్రత, డిజిటల్ ఫోరెన్సిక్స్, కృత్రిమ మేధస్సు భద్రత, కీలక మౌలిక సదుపాయాలు, సైబర్ ముప్పు నిఘా, బ్లాక్‌చైన్, క్రిప్టో, డ్రోన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఫోరెన్సిక్స్, డిజిటల్ సాక్ష్యాలు, సైబర్ చట్టాలు, క్లౌడ్ భద్రత సహా 10 అంశాలను ఖరారు చేశారు.
సదస్సులో భాగంగా ప్రారంభ సెషన్, సాంకేతిక, వాణిజ్య సెషన్లు, ప్యానెల్ చర్చలు, పారిశ్రామిక ప్రదర్శనతో పాటు ‘సైబర్ కుస్తీ 2026’ పేరిట సైబర్ భద్రత, కృత్రిమ మేధస్సు హ్యాకథాన్ నిర్వహిస్తారు. జాతీయ సైబర్ భద్రత, కీలక మౌలిక సదుపాయాల రక్షణ, సైబర్ దాడుల నిరోధక చర్యలు, ఆర్థిక సైబర్ నేరాలు, డిజిటల్ దర్యాప్తు, న్యాయ అమలు సంస్థల సంసిద్ధత తదితర అంశాలపై సాంకేతిక సెషన్లలో చర్చిస్తారు.
ఈ హ్యాకథాన్ కోసం 1,031 బృందాల నుంచి 3,093 మంది అభ్యర్థులు పేర్లు నమోదు చేసుకున్నారు. వీరిలో మొదటి దశకు 923 బృందాల నుంచి 2,769 మంది ఎంపికయ్యారు. రెండో దశకు 50 బృందాలు, మూడో దశకు 10 బృందాలు అర్హత సాధించాయి. మూడు దశల్లో జరిగే ఈ పోటీని ‘రివ్యూ’, ‘అటాక్’, ‘డిఫెండ్’ అనే అంశాల ఆధారంగా రూపొందించారు.
ఈ సదస్సులో ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్, ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, ఢిల్లీ పోలీసులు, సైబర్ పీస్, స్టాండర్డైజేషన్ టెస్టింగ్ అండ్ క్వాలిటీ సర్టిఫికేషన్ డైరెక్టరేట్, మిలిటరీ కాలేజ్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ తదితర సంస్థలు నాలెడ్జ్ పార్ట్‌నర్స్‌గా పాల్గొంటాయి. డిజిటల్ ఫోరెన్సిక్స్, సైబర్ భద్రత రంగాల్లో పనిచేస్తున్న వివిధ కంపెనీలు పారిశ్రామిక భాగస్వాములుగా వ్యవహరిస్తాయి.
సదస్సు సందర్భంగా నైలెట్, పారిశ్రామిక భాగస్వాముల మధ్య అవగాహన ఒప్పందాలు (ఎంఓయూ) కుదరనున్నాయి. సంస్థాగత భాగస్వామ్యం, విజ్ఞాన మార్పిడి, ఉమ్మడి కార్యక్రమాలు, పరిశోధన, అభివృద్ధి, సైబర్ భద్రత, డిజిటల్ ఫోరెన్సిక్స్ రంగాలలో సామర్థ్య పెంపును ప్రోత్సహించడం దీని లక్ష్యం.
నైలెట్ మొదటి జాతీయ సదస్సు 2024లో నాగాలాండ్‌లోని కోహిమాలో జరిగింది. రెండో సదస్సు 2025లో అసోంలోని గౌహతి విశ్వవిద్యాలయంలో నిర్వహించారు. మూడో సదస్సు ద్వారా ఈ వేదికను జాతీయ స్థాయిలో మరింత విస్తరించడంతో పాటు సైబర్ భద్రతకు సంబంధించిన సంస్థలు, నిపుణుల మధ్య సహకారాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi