
న్యూఢిల్లీ, 15 నవంబర్ (హి.స.)
భారత్-ఈజిప్టు
వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం,
ద్వైపాక్షిక వాణిజ్య, పెట్టుబడి సంబంధాలను
విస్తరించే లక్ష్యంతో కేంద్ర వాణిజ్య,
పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్
నవంబర్ 14న కైరో చేరుకున్నారు.
ఆయన వెంట 130 మందికి పైగా
పారిశ్రామిక ప్రతినిధులు, స్టార్టప్ అధినేతలతో కూడిన ప్రతినిధి బృందం వెళ్లింది.
కైరోలోని హెలియోపోలిస్ వార్ సెమెటరీలో
భారత సైనికులకు పీయూష్ గోయల్ నివాళులర్పించారని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ
శాఖ తెలిపింది. ఈ స్మారక స్థలంలో ఖననం చేసిన లేదా స్మరించుకుంటున్న సుమారు 4,000 మంది
సైనికులలో 3,727 మంది భారతీయులు ఉన్నారు.
వీరిలో దాదాపు 2,000 మంది
మొదటి ప్రపంచ యుద్ధంలో, 1,700 మంది రెండో ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు అర్పించారు.
ఈజిప్టులోని ఇండియన్ కమ్యూనిటీ అసోసియేషన్
నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న గోయల్ ప్రవాస భారతీయులతో ముఖాముఖి
నిర్వహించారు. భారత్, ఈజిప్టుల మధ్య ప్రస్తుతం సుమారు 6.5 బిలియన్ అమెరికన్
డాలర్లుగా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యం రెండు ప్రాచీన నాగరికతల మధ్య భాగస్వామ్యానికి
ఆరంభం మాత్రమేనని ఆయన పేర్కొన్నారు.
ఈజిప్టులో దాదాపు 70 భారతీయ కంపెనీలు
కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, వీటి పెట్టుబడులు 5
బిలియన్ డాలర్లకు పైగా ఉన్నాయని ఆయన
తెలిపారు.ఈ సంస్థలు ఈజిప్టు ప్రజలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి
అవకాశాలను కల్పిస్తున్నాయని చెప్పారు.ప్రవాస భారతీయులను రెండు దేశాల మధ్య
సజీవ వారధిగా అభివర్ణించిన గోయల్, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంలో వారి పాత్రను కొనియాడారు.
ఈ పర్యటనలో భాగంగా భారత్-ఈజిప్టు
జాయింట్ ట్రేడ్ కమిటీ (జేటీసీ) ఏడో సమావేశం,
భారత్-ఈజిప్టు జాయింట్ బిజినెస్
కౌన్సిల్ (జేబీసీ) భేటీ, భారత్-ఈజిప్టు బిజినెస్ ఫోరం జరగనున్నాయి. నవంబర్ 15న కైరోలో జరిగే
జాయింట్ ట్రేడ్ కమిటీ సమావేశానికి పీయూష్ గోయల్,
ఈజిప్టు పెట్టుబడులు, విదేశీ వాణిజ్య శాఖ
మంత్రి డాక్టర్ మొహమ్మద్ ఫరీద్ సలేహ్ సంయుక్తంగా అధ్యక్షత వహిస్తారు.
ఈజిప్టు సీనియర్ మంత్రులతో ద్వైపాక్షిక
సమావేశాలు, ప్రముఖ పారిశ్రామికవేత్తలతో చర్చలతో పాటు ఆఫ్రికన్ ఎక్స్‌పోర్ట్-ఇంపోర్ట్
బ్యాంక్ (అఫ్రెక్సిమ్ బ్యాంక్), ఈజిప్షియన్ జూనియర్ బిజినెస్‌మెన్ అసోసియేషన్, ఈజిప్టు-ఇండియా
స్టార్టప్స్ ఫోరం ప్రతినిధులతో గోయల్ సమావేశమవుతారు.
వాణిజ్య,
పెట్టుబడి సంబంధిత అంశాలను సమీక్షించి, కొత్త వ్యాపార
భాగస్వామ్యాలకు అవకాశాలను గుర్తించడంపై ఈ చర్చలు ప్రధానంగా దృష్టి సారిస్తాయి.
చరిత్ర,
నాగరికత,
ప్రజల మధ్య సంబంధాలతో భారత్, ఈజిప్టుల మధ్య
దీర్ఘకాలిక అనుబంధం ఉంది. కాలక్రమేణా పలు రంగాలలో సహకారంతో ఈ బంధం వ్యూహాత్మక
భాగస్వామ్యంగా ఎదిగింది. వాణిజ్యం, పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధిలో పరస్పర సహకారాన్ని విస్తరించడం ద్వారా
ఈ సంబంధాలను మరింత దృఢతరం చేయడమే గోయల్ పర్యటన ప్రధాన ఉద్దేశం.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi