నేటి నుంచి 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్.. హాజరుకానున్న గడ్కరీ, సీఎం రేవంత్
దేశంలో రహదారుల అభివృద్ధి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై చర్చించేందుకు నిర్వహిస్తున్న 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ (ఐఆర్సీ) నేటి నుంచి ప్రారంభం కానుంది.
Nitin Gadkari


హైదరాబాద్ , 19 నవంబర్ (హి.స.)

దేశంలో రహదారుల అభివృద్ధి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై చర్చించేందుకు నిర్వహిస్తున్న 85వ ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ (ఐఆర్సీ) నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరుకానున్నారు. ముగింపు సమావేశానికి గవర్నర్ పాల్గొననున్నారు.

ఈ సదస్సుకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 3,500 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. రహదారుల నిర్మాణంలో వస్తున్న ఆధునిక మార్పులు, కొత్త టెక్నాలజీ వినియోగం, నాణ్యత ప్రమాణాలు, నిర్మాణ వ్యయాన్ని తగ్గించే మార్గాలపై నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా రోడ్లను ఎలా అభివృద్ధి చేయాలనే అంశంపై ప్రత్యేకంగా చర్చించనున్నారు.

మరోవైపు తెలంగాణలో రహదారుల విస్తరణకు ప్రభుత్వం భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. రాబోయే రెండేళ్లలో సుమారు రూ.93 వేల కోట్ల వ్యయంతో వివిధ రహదారుల నిర్మాణం చేపట్టాలని ప్రణాళిక రూపొందించింది. ఈ సదస్సు ద్వారా రోడ్ల నిర్మాణంలో అంతర్జాతీయ ప్రమాణాలు, నూతన విధానాలపై అవగాహన పెరగడంతో పాటు రాష్ట్ర రహదారుల అభివృద్ధికి ఉపయోగపడే అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande