
హైదరాబాద్ , 21 నవంబర్ (హి.స.)
హైదరాబాద్లో మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నగరంలోని శ్రీసత్యసాయి నిగమాగమంలో ‘సిటీ కన్వెన్షన్ ఆన్ డ్రగ్ ఫ్రీ ఇండియా’ పేరుతో భారీ సదస్సు నిర్వహించనున్నారు. డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు యువతను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచే లక్ష్యంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సదస్సుకు పలువురు రాజకీయ, సామాజిక రంగ ప్రముఖులు హాజరయ్యారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ ఎంపీ లక్ష్మణ్, రాజకీయ విశ్లేషకుడు జయప్రకాశ్ నారాయణ, ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు, బీజేపీ నేత మహేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రస్తుతం యువతలో డ్రగ్స్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో దాని నియంత్రణకు సమాజంలోని అన్ని వర్గాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందనే అంశంపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చించనున్నారు. విద్యార్థులు, యువతకు మాదకద్రవ్యాల వల్ల ఎదురయ్యే ఆరోగ్య, సామాజిక సమస్యలను వివరించడం, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశంగా ఉంది. డ్రగ్స్ రహిత భారతదేశ నిర్మాణానికి ప్రజల భాగస్వామ్యం కీలకమనే సందేశాన్ని ఈ వేదిక ద్వారా అందించనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్