
హైదరాబాద్ , 21 నవంబర్ (హి.స.)
హైదరాబాద్లోని మియాపూర్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ పెయింట్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతాల్లో కలకలం రేగింది. దుకాణం ముందు బోర్డు ఏర్పాటు చేసే పనుల్లో భాగంగా వెల్డింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం.
వెల్డింగ్ సమయంలో వెలువడిన నిప్పురవ్వలు పెయింట్లు, ఇతర మండే స్వభావం కలిగిన వస్తువులపై పడటంతో మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. క్షణాల్లోనే అగ్నికీలలు దుకాణంలో విస్తరించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. దుకాణంలో పెయింట్లు, రసాయన సంబంధిత పదార్థాలు ఉండటంతో మంటలు మరింత వ్యాపించకుండా సిబ్బంది జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్