
హైదరాబాద్ , 21 నవంబర్ (హి.స.)
హైదరాబాద్లో ఆహార భద్రతా ప్రమాణాలు పాటించని హోటళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు కొరడా ఝళిపించారు. వినియోగదారుల నుంచి అందిన ఫిర్యాదుల ఆధారంగా టీజీ సేఫ్ ప్రత్యేక తనిఖీలు చేపట్టింది. మొత్తం 8 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి నగరంలోని పలు ప్రాంతాల్లో 9 సంస్థలను తనిఖీ చేశాయి.
ఈ తనిఖీల్లో పలు హోటళ్లు, రెస్టారెంట్ల వంటశాలల్లో అపరిశుభ్ర పరిస్థితులు బయటపడ్డాయి. ఆహార పదార్థాల నిల్వ ప్రాంతాల్లో బొద్దింకలు, ఎలుకలు సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా శాఖాహారం, మాంసాహార పదార్థాలను వేర్వేరుగా ఉంచకుండా కలిపి నిల్వ చేస్తున్నట్లు గుర్తించారు.
ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ లేకుండా నిర్వహిస్తున్న రెండు సంస్థలను అధికారులు మూసివేశారు. ఆహార నాణ్యతపై అనుమానాలు రావడంతో ఎనిమిది నమూనాలను పరీక్షల కోసం సేకరించారు. సుమారు 135 కిలోల ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. మరో నాలుగు సంస్థల ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సులను సస్పెండ్ చేయగా, నాలుగు సంస్థలకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. మెహఫిల్ రెస్టారెంట్కు ఇంప్రూవ్మెంట్ నోటీసులు జారీ చేశారు. లైసెన్సులు సస్పెండ్ అయిన సంస్థలను స్విగ్గీ, జొమాటో నుంచి తొలగించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్