
హైదరాబాద్ , 21 నవంబర్ (హి.స.)
ఖమ్మం జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన రైతులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఊరటనిచ్చారు. సాగునీరు అందక పంటలు దెబ్బతింటున్నాయని, వెంటనే నీటిని విడుదల చేసి తమను ఆదుకోవాలని రైతులు మంత్రికి విజ్ఞప్తి చేశారు. రైతుల సమస్యను తెలుసుకున్న మంత్రి తుమ్మల వెంటనే స్పందించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను విడుదల చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో అధికారులు వెంటనే నీటి విడుదలకు చర్యలు చేపట్టారు. వైరా, ఏన్కూరు, రామచంద్రాపురం ప్రాంతాలకు గోదావరి జలాలను విడుదల చేశారు. దీంతో సాగునీటి కోసం ఎదురుచూస్తున్న రైతులకు కొంత ఉపశమనం లభించింది.
ఈ సందర్భంగా విడుదల చేసిన నీటిని రైతులు బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని మంత్రి సూచించారు. నీటిని కేవలం పంటల సాగు అవసరాలకే ఉపయోగించాలని, వృథా చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రైతుల పంటలు ఎండిపోకుండా అవసరమైన సమయంలో సాగునీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రైతుల విజ్ఞప్తిపై మంత్రి వెంటనే స్పందించి నీటిని విడుదల చేయించడంతో స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్