
నిజామాబాద్, 21 నవంబర్ (హి.స.)
నిజామాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని అన్నారు.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతికి సంబంధించిన అంశాలు, ఆధారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అక్రమాలపై ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడిందని మహేశ్ గౌడ్ విమర్శించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా, హరీశ్ రావు మంత్రిగా ఉన్న సమయంలో నీటి నిర్వహణలో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ప్రతిష్ఠాత్మకంగా ప్రచారం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం వృథా అయిందని వ్యాఖ్యానించారు. ప్రాజెక్టుల నిర్మాణం, ఖర్చులు, నాణ్యత వంటి అంశాలపై ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత గత పాలకులపై ఉందని అన్నారు.
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో భూ ఆక్రమణలు, భూదోపిడీ విచ్చలవిడిగా సాగిందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ భూములు, ప్రజా ఆస్తుల విషయంలో జరిగిన అక్రమాలపై అనేక ప్రశ్నలు ఉన్నాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అవినీతి చిట్టా చాలా పెద్దదని, గత పాలనలో జరిగిన తప్పిదాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయని విమర్శించారు. అవినీతి ఆరోపణలపై విచారణలు, ఆధారాల ఆధారంగా నిజానిజాలు తేలాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు