బీజేపీలో చేరిన వివిధ పార్టీల నేతలు.. కండువా కప్పి ఆహ్వానించిన రామచందర్రావు
హైదరాబాద్లో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన పలువురు నాయకులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
Bjp


హైదరాబాద్ , 21 నవంబర్ (హి.స.)హైదరాబాద్లో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన పలువురు నాయకులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. దేశంలో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు, కేంద్ర ప్రభుత్వ విధానాలను గమనిస్తున్న మేధావులు బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.

అనంతరం కాంగ్రెస్ పార్టీపై రామచందర్రావు విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనల్లో భారతదేశ ప్రతిష్ఠను తగ్గించేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. మరోవైపు హైదరాబాద్లో మెటా సంస్థ కార్యాలయంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తామని ప్రభుత్వం చెబుతూనే, ఇక్కడ పెట్టుబడులు పెట్టిన సంస్థలపై దాడులు జరగడం ఏమిటని ప్రశ్నించారు.

ఇలాంటి ఘటనలు కొనసాగితే అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్కు రావడానికి ఎలా ఆసక్తి చూపుతాయని నిలదీశారు. పెట్టుబడిదారులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాల హయాంలో జరిగిన అవినీతి వ్యవహారాలను వెలికితీస్తామని రామచందర్రావు హెచ్చరించారు. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande