
పల్నాడు జిల్లా, 21 నవంబర్ (హి.స.)
పల్నాడు జిల్లాలో స్థానిక ఎన్నికల నామినేషన్ల సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పిడుగురాళ్ల మండలం చెన్నాయపాలెం గ్రామంలో టీడీపీ, వైఎస్సార్సీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. నామినేషన్లు దాఖలు చేసి తిరిగి వస్తున్న వెంకటేశ్వర్లుపై వైఎస్సార్సీపీ శ్రేణులు దాడికి పాల్పడినట్లు సమాచారం.
ఈ ఘటనలో వెంకటేశ్వర్లుకు చెందిన కారు అద్దాలను ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా టీడీపీ వర్గీయులపై రాళ్లు, కర్రలతో దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇరు వర్గాల మధ్య ఘర్షణతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
మరోవైపు కరాలపాడు గ్రామంలోనూ నామినేషన్ కేంద్రం వద్ద వివాదం తలెత్తింది. అక్కడ వైఎస్సార్సీపీ శ్రేణులు పోలీసులపై దాడికి ప్రయత్నించినట్లు సమాచారం. ఈ క్రమంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం జరిగి తోపులాటకు దారితీసింది.
వరుస ఘటనలతో అప్రమత్తమైన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా ఆయా గ్రామాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఘర్షణలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్