
హైదరాబాద్ , 22 నవంబర్ (హి.స.)
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలపై దృష్టి సారించేందుకు ఏఐసీసీ నూతన ఇన్ఛార్జి సందీప్ నేడు హైదరాబాద్కు రానున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో గాంధీభవన్లో పార్టీ ముఖ్య నేతలతో వరుస సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా ఇవాళ పీఏసీ (రాజకీయ వ్యవహారాల కమిటీ), పీసీసీ సభ్యులతో ఉమ్మడి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సందీప్ హాజరై పార్టీ నేతలతో చర్చించనున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడం, పార్టీ కార్యకలాపాలను క్షేత్రస్థాయికి విస్తరించడం వంటి అంశాలు ఈ భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. పార్టీ నాయకుల మధ్య సమన్వయం, భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపైనా ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.
ఇక రేపు కూడా సందీప్ పలు సమావేశాల్లో పాల్గొననున్నారు. ఉదయం గాంధీభవన్లో రాష్ట్ర మంత్రులతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. అనంతరం మధ్యాహ్నం జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు, పీసీసీ అనుబంధ సంఘాల అధ్యక్షులతో సమావేశం నిర్వహించనున్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సమావేశాలు జరగనున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్