
నాగర్ కర్నూల్, 22 నవంబర్ (హి.స.)
పార్టీ క్రమశిక్షణను, విధివిధానాలను పక్కన పెట్టి లక్ష్మణ రేఖ దాటిన ఇద్దరు ప్రజాప్రతినిధుల వ్యవహారం తన దృష్టికి వచ్చిందని కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం చైర్మన్, ఎంపీ మల్లు రవి అన్నారు.
ఆదివారం అచ్చంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి మీడియాతో చిట్ చాట్ లో ఆయన మాట్లాడారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఇటీవల ప్రభుత్వ తీరుపై బహిరంగంగా విమర్శలు చేసిన విషయాన్ని పలువురు పెద్దలు తన దృష్టికి తీసుకొచ్చారన్నారు.
దీనిపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో మాట్లాడానని, కొత్త ఏఐసీసీ ఇంచార్జ్ సందీప్ దృష్టికి కూడా తీసుకెళ్లానని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం పొలిటికల్ అఫైర్స్ కమిటీ ప్రత్యేకంగా భేటీ కానుందని తెలిపారు. పార్టీ నిర్ణయాలకు భిన్నంగా, క్రమశిక్షణకు విరుద్ధంగా ఇకపై ఎవరూ బహిరంగ వ్యాఖ్యలు చేయకుండా కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందన్నారు. ఆ భేటీకి తాను కూడా హాజరవుతానని మల్లు రవి స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు