ఎస్ఐఆర్ను అడ్డుకునే వాళ్లంతా దేశద్రోహులే: బండి సంజయ్
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను వ్యతిరేకిస్తున్న వారిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
bandi sanjay


హైదరాబాద్ , 22 నవంబర్ (హి.స.)

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను వ్యతిరేకిస్తున్న వారిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ప్రక్రియను అడ్డుకోవాలని ప్రయత్నించే వారంతా దేశద్రోహులేనని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన వారికి ఓటు హక్కు కల్పించాలని కోరుకునే వారు మూర్ఖులని విమర్శించారు.

దేశంలో ప్రధానమంత్రి, రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఎవరుండాలనే విషయాన్ని నిర్ణయించే హక్కు కేవలం భారత పౌరులకే ఉంటుందని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఓటర్ల జాబితాలో అక్రమాలకు తావులేకుండా ఎస్ఐఆర్ నిర్వహించడం అవసరమని అభిప్రాయపడ్డారు.

ఇదే సమయంలో తెలంగాణ రాజకీయాలపైనా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎదుగుదలను చూసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భయపడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి బీజేపీని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. అయితే ఆ రెండు పార్టీలకు బీజేపీని ఎదుర్కొనే సత్తా లేదని వ్యాఖ్యానించారు.

రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్లోని గురుద్వారా వద్ద సోలార్ ప్యానెల్ను ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande