
కరీంనగర్ , 22 నవంబర్ (హి.స.)కరీంనగర్లో రేపు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీ మహాపాదయాత్ర నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ హాజరుకానున్నారు. ఆయన పర్యటనను విజయవంతం చేసేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా సన్నాహాలు చేస్తున్నారు. భారీ సంఖ్యలో ప్రజలను సమీకరించడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.
ఈ మహాపాదయాత్రకు సుమారు లక్ష మందిని తరలించే లక్ష్యంతో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కరీంనగర్లోని గాంధీ విగ్రహం నుంచి కమాన్ చౌరస్తా వరకు పాదయాత్ర కొనసాగనుంది. ఈ నేపథ్యంలో యాత్ర నిర్వహించే మార్గాన్ని బండి సంజయ్ పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు. రూట్ మ్యాప్, జన సమీకరణ, భద్రతా ఏర్పాట్లపై నాయకులతో చర్చించారు.
మహాపాదయాత్ర సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. ట్రాఫిక్ సమస్యలు, ప్రజల రాకపోకలకు అంతరాయం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. నితిన్ నబీన్ పాల్గొంటున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీజేపీ శ్రేణులు భారీ జనసమీకరణతో యాత్రను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్