
అమరావతి , 22 నవంబర్ (హి.స.)
ఆంధ్రప్రదేశ్లో జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) పథకాల అమలు తీరును పరిశీలించేందుకు కేంద్ర బృందాలు నేటి నుంచి క్షేత్రస్థాయి పర్యటన చేపట్టనున్నాయి. రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఐదు రోజుల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. ఈ సందర్భంగా కేంద్ర బృందాలు ఆయా జిల్లాల్లో ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న వివిధ కార్యక్రమాలను పరిశీలించనున్నాయి.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవలు, ఆరోగ్య కేంద్రాల పనితీరు, వైద్య సదుపాయాలు, సిబ్బంది అందుబాటు వంటి అంశాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎన్హెచ్ఎం నిధుల వినియోగం, పథకాల అమలు పురోగతి, ప్రజలకు అందుతున్న వైద్య సేవల నాణ్యతపై బృందాలు వివరాలు సేకరించనున్నాయి.
కేంద్ర బృందాల పర్యటన నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారులు అవసరమైన సమాచారాన్ని సిద్ధం చేస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో జాతీయ ఆరోగ్య మిషన్ కింద చేపట్టిన కార్యక్రమాలు, సాధించిన పురోగతి, అమలులో ఎదురవుతున్న సమస్యలకు సంబంధించిన వివరాలను కేంద్రానికి నివేదించనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్