
హైదరాబాద్ , 22 నవంబర్ (హి.స.) బస్తీ దవాఖాన ప్రారంభోత్సవం సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని ఉద్రిక్తతకు దారితీసింది. మేడ్చల్ జిల్లా సూరారం పరిధిలోని శ్రీకృష్ణానగర్‌లో ఈ ఘటన జరిగింది. దవాఖాన ప్రారంభానికి ఏర్పాటు చేసిన శిలాఫలకం వివాదానికి కారణమైంది.
శిలాఫలకం ఏర్పాటు విషయంలో నిబంధనలు, ప్రోటోకాల్ పాటించలేదని కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, స్థానిక కాంగ్రెస్ నాయకుల పేర్లను ప్రస్తావించకుండా బీఆర్ఎస్ నేతలు శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారని ఆరోపించారు. అధికారిక కార్యక్రమంలో ప్రజాప్రతినిధులకు తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా వ్యవహరించడంపై వారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ఈ విషయమై ఇరు పార్టీల నాయకుల మధ్య మొదట మాటల యుద్ధం మొదలై, అనంతరం ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో కార్యక్రమం వద్ద కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఇరు వర్గాల నాయకులు, కార్యకర్తలను అదుపు చేశారు.
పోలీసుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. అనంతరం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు చర్యలు చేపట్టారు. స్థానికంగా ఈ ఘటన రాజకీయ చర్చకు దారితీసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్