సర్పంచ్ నామినేషన్ల వేళ ఉద్రిక్తత.. టీడీపీ, వైఎస్సార్సీపీ వర్గాల మధ్య ఘర్షణ
ఆంధ్రప్రదేశ్లో గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో కడప జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.
సర్పంచ్ నామినేషన్ల వేళ ఉద్రిక్తత.. టీడీపీ, వైఎస్సార్సీపీ వర్గాల మధ్య ఘర్షణ


అమరావతి , 22 నవంబర్ (హి.స.)ఆంధ్రప్రదేశ్లో గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో కడప జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. నామినేషన్ల స్వీకరణ రెండో రోజున చాపాడు నామినేషన్ కేంద్రం వద్ద టీడీపీ, వైఎస్సార్సీపీ వర్గాల మధ్య వాగ్వాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది.

వివరాల్లోకి వెళ్తే.. చాపాడు నామినేషన్ కేంద్రానికి సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేసేందుకు చియ్యపాడుకు చెందిన వైఎస్సార్సీపీ మద్దతుదారులు వచ్చారు. అయితే అక్కడ ఉన్న టీడీపీ వర్గీయులు వారిని అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వివాదం మొదలైంది. తొలుత మాటామాటా పెరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో నామినేషన్ కేంద్రం వద్ద కొంతసేపు గందరగోళం నెలకొంది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఇరువర్గాల వారిని అదుపు చేసేందుకు ప్రయత్నించి, అక్కడి నుంచి చెదరగొట్టారు. దీంతో పరిస్థితి కొంతవరకు అదుపులోకి వచ్చింది. నామినేషన్ల ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలగకుండా పోలీసులు భద్రతను పర్యవేక్షించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande