పంచాయతీల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహించాలి: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ ముఖ్యనేతలు, మంత్రులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
Chandrababu Naidu


అమరావతి , 22 నవంబర్ (హి.స.)

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ ముఖ్యనేతలు, మంత్రులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు, రాబోయే గ్రామపంచాయతీ ఎన్నికలు, ఏకగ్రీవాల అంశాలపై వారితో చర్చించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ఏకగ్రీవ ఎన్నికలను ప్రోత్సహించే విషయంలో సీఎం కీలక సూచనలు చేశారు.

గ్రామాల అభివృద్ధికి దోహదపడే విధంగా పంచాయతీల్లో ఏకగ్రీవాలను ప్రోత్సహించాలని చంద్రబాబు నేతలకు సూచించారు. ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు అందించే ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఎన్నికల కోసం అనవసరమైన పోటీ, విభేదాలకు తావివ్వకుండా గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.

ఇటీవల జరిగిన మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు ప్రజల అభిప్రాయాన్ని స్పష్టంగా తెలియజేశాయని చంద్రబాబు అన్నారు. కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్లుగా అమలు చేస్తున్న పాలనకు ఈ విజయాలు ప్రజలు ఇచ్చిన గుర్తింపుగా అభివర్ణించారు. పార్టీ గుర్తులపై జరిగిన ఎన్నికల్లో ఓటర్లు స్పష్టమైన తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు.

మరోవైపు, ప్రజల తీర్పును ప్రతిపక్ష పార్టీ జీర్ణించుకోలేకపోతోందని విమర్శించారు. కూటమి నేతలు వ్యక్తిగత పట్టింపులు, అహంకారాలకు దూరంగా ఉండాలని, పార్టీ శ్రేణుల్లో ఐక్యతను మరింత బలోపేతం చేయాలని చంద్రబాబు సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande