తెలంగాణ ఎగుమతుల్లో 68 శాతం వృద్ధి.. హర్షం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రం నుంచి విదేశాలకు జరిగే ఎగుమతులు గణనీయంగా పెరగడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.
Telangana CM Revanth Reddy


హైదరాబాద్ , 22 నవంబర్ (హి.స.)

తెలంగాణ రాష్ట్రం నుంచి విదేశాలకు జరిగే ఎగుమతులు గణనీయంగా పెరగడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. గత మూడేళ్లతో పోలిస్తే రాష్ట్ర ఎగుమతులు ఏకంగా 68 శాతం వృద్ధి సాధించాయని వెల్లడించారు. తయారీ రంగాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ఎగుమతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయని పేర్కొన్నారు.

ముఖ్యంగా ఏరోస్పేస్, ఇంజినీరింగ్ రంగాల్లో ఎగుమతులు పెరుగుతుండటం రాష్ట్ర ఆర్థిక ప్రగతికి సంకేతమని సీఎం అభిప్రాయపడ్డారు. వ్యాపార సంస్థలకు అనుకూలమైన వాతావరణం కల్పించడం, అనుమతుల ప్రక్రియను సులభతరం చేయడం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను మెరుగుపరచడం వంటి చర్యలు ఈ వృద్ధికి దోహదపడుతున్నాయని తెలిపారు. క్రియాశీలక పాలనతో పారిశ్రామిక రంగానికి మరిన్ని అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు.

ప్రస్తుతం కనిపిస్తున్న ఎగుమతుల వృద్ధి కేవలం ఆరంభం మాత్రమేనని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం రూపొందించిన క్యూర్, ప్యూర్, రేర్ ప్రణాళికల ద్వారా రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు మరింత విస్తరిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యాన్ని తప్పకుండా సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande