
హైదరాబాద్ , 22 నవంబర్ (హి.స.)
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల నూతన ఇన్ఛార్జి బి. సందీప్ కుమార్ హైదరాబాద్కు చేరుకున్నారు. ఆయనకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు విమానాశ్రయంలో స్వాగతం పలికి ఆహ్వానించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా సందీప్ కుమార్ వరుస సమావేశాలకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా గాంధీభవన్లో నిర్వహించనున్న పీఏసీ, పీసీసీ ఉమ్మడి సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. పార్టీ రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ పనితీరు, సంస్థాగత వ్యవహారాలు, భవిష్యత్ కార్యాచరణపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు.
ఇక రేపు కూడా ఆయన బిజీ షెడ్యూల్ కొనసాగనుంది. ఉదయం రాష్ట్ర మంత్రులతో ప్రత్యేకంగా సమావేశమై ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీతో సమన్వయం వంటి అంశాలపై చర్చించనున్నారు. అనంతరం మధ్యాహ్నం జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు, పీసీసీ అనుబంధ సంఘాల అధ్యక్షులతో భేటీ కానున్నారు.
క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం, నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం పెంచడం, రాబోయే రోజుల్లో అనుసరించాల్సిన రాజకీయ వ్యూహాలపై ఈ సమావేశాల్లో దిశానిర్దేశం చేయనున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. సందీప్ కుమార్ పర్యటనతో తెలంగాణ కాంగ్రెస్లో రాజకీయ సందడి నెలకొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్