
హైదరాబాద్ , 22 నవంబర్ (హి.స.)
గాంధీ భవన్ వేదికగా కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం ప్రారంభమైంది. నూతన ఏఐసీసీ ఇన్ఛార్జి బి. సందీప్ కుమార్ అధ్యక్షతన ఈ భేటీ కొనసాగుతోంది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. పార్టీకి చెందిన పలువురు ముఖ్య నేతలు కూడా పాల్గొంటున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ మూడేళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలపై నేతలు ప్రధానంగా చర్చిస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో ఎంతవరకు చేరుతున్నాయి అనే అంశాలపై సమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది.
అదేవిధంగా ప్రభుత్వ పనితీరును ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లడం, పార్టీ సంస్థాగత బలోపేతం, రాబోయే రాజకీయ కార్యాచరణ వంటి అంశాలు కూడా సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయాన్ని మరింత మెరుగుపరిచే దిశగా నేతలు అభిప్రాయాలు పంచుకుంటున్నారు. నూతన ఏఐసీసీ ఇన్ఛార్జి బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలపై కాంగ్రెస్ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్