2022 కానిస్టేబుల్ నియామకాల్లో మిగిలిన 400 పోస్టులు భర్తీ చేయాల్సిందే
2022లో పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. నియామక ప్రక్రియలో భర్తీ కాకుండా మిగిలిపోయిన 400 ఖాళీలను తదుపరి మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులతో భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు నియామక మండ
Court


హైదరాబాద్ , 22 నవంబర్ (హి.స.)

2022లో పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. నియామక ప్రక్రియలో భర్తీ కాకుండా మిగిలిపోయిన 400 ఖాళీలను తదుపరి మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్థులతో భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు నియామక మండలిని ఆదేశించింది. ఈ ప్రక్రియను నాలుగు నెలల్లోగా పూర్తి చేయాలని స్పష్టం చేసింది.

కానిస్టేబుల్ నోటిఫికేషన్లోని క్లాజ్ 33(9)ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. ప్రొవిజినల్ ఎంపిక జాబితాను సమీక్షించబోమని, వెయిటింగ్ లిస్ట్ ఉండదని, మిగిలిపోయిన పోస్టులను రద్దు చేస్తామని నోటిఫికేషన్లో పేర్కొన్న నిబంధన చెల్లదని న్యాయస్థానం స్పష్టం చేసింది.

ఖాళీగా ఉన్న పోస్టులను అర్హులైన అభ్యర్థులకు అవకాశం కల్పించేలా భర్తీ చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్ ఎన్. విజయ్ ఇటీవల కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఈ తీర్పుతో 2022 కానిస్టేబుల్ నియామకాల్లో ఎంపిక కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఊరట లభించనుంది. తదుపరి మెరిట్ ఆధారంగా తమకు ఉద్యోగ అవకాశం వస్తుందని ఆశిస్తున్న అభ్యర్థుల్లో హైకోర్టు నిర్ణయం కొత్త ఆశలు రేకెత్తించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande