వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
వికారాబాద్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఆటోను లారీ ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
Accident


వికారాబాద్ , 22 నవంబర్ (హి.స.)వికారాబాద్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. ఆటోను లారీ ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన బుగ్గరామేశ్వరం సమీపంలో చోటుచేసుకుంది. ప్రమాదంలో ముగ్గురు మహిళలతో పాటు ఆటో డ్రైవర్ కూడా మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెండ్లిమడుగు నుంచి కేరెల్లి వైపు నలుగురు ఆటోలో ప్రయాణిస్తున్నారు. మార్గమధ్యంలోని బుగ్గరామేశ్వరం సమీపంలోకి చేరుకోగానే ఎదురుగా వచ్చిన లారీ ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు ఆటో పూర్తిగా దెబ్బతినడంతో అందులో ప్రయాణిస్తున్న వారు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనలో నలుగురూ అక్కడికక్కడే మృతి చెందారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని గుర్తింపు ప్రక్రియ పూర్తి చేశారు. మృతులను నాగేశ్, చంద్రమ్మ, పార్వతమ్మ, సరితగా గుర్తించారు.

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడటంతో వారి బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande