
హైదరాబాద్ , 22 నవంబర్ (హి.స.)
హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద నుంచి 1.049 కిలోల బంగారాన్ని గుర్తించి పట్టుకున్నారు. ఈ బంగారం విలువ సుమారు రూ.1.37 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు.
వివరాల్లోకి వెళ్తే.. రాత్రి సమయంలో దుబాయ్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికుడి కదలికలపై అధికారులకు అనుమానం కలిగింది. దీంతో అతడి లగేజీని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో ట్రాలీ బ్యాగులో ఉన్న వాలెట్లో ప్రత్యేకంగా దాచిన తొమ్మిది బంగారు బార్లను గుర్తించారు. వాటిని బయటకు తీసి పరిశీలించగా మొత్తం 1.049 కిలోల బరువు ఉన్నట్లు తేలింది. బంగారు బార్లపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కు సంబంధించిన మార్కింగ్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఈ వ్యవహారంలో ప్రయాణికుడితో పాటు, అతడి వద్ద నుంచి బంగారాన్ని స్వీకరించేందుకు విమానాశ్రయానికి వచ్చిన మరో వ్యక్తిని కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఇద్దరినీ అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. బంగారం అక్రమ రవాణా వెనుక మరెవరైనా ఉన్నారా అనే కోణంలో అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్